Tuesday, March 19, 2013

శాస్త్రీయ అన్వేషణ


ఒక సాధారణ మరియు ముఖ్యమైన ప్రశ్న. 
మనము ఎక్కడ ఉన్నాము? 
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని, తిరిగి దానిని నెమరు వేసుకుంటే అందులో ఒక జ్ఞానోదయం ఉన్నదని తెలుస్తుంది. 
(ఈ ప్రశ్నను నేను చాలా మందిని నేరుగా అడిగాను. చాలా తక్కువమంది మిక్కిలి సరియైన సమాధానం ఇచ్చారు. అనేక సందర్భాలలో వారి సమాధానం జాలి గొలిపేల ఉన్నది)
ఈ ప్రశ్న అడగడంలో ఒక నిబంధన ఉంది. అది ఏమిటంటే ఈ ప్రశ్నను విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకు, సమాధానం 'భారత దేశం' అంటే 'భారత దేశం ఎక్కడ ఉంది?' అన్నది తరువాత ప్రశ్న.
ఇప్పుడు ఈ ప్రశ్నను మిమ్మల్ని మీరు అడగండి. శాస్త్రీయ విజ్ఞానం యొక్క సమాధానం ఈ క్రింద ఉంది. సరిపోల్చుకోగలరు.
1. పలానా గ్రామం/పట్టణం/నగరం
2. రాష్ట్రం
3. దేశం
4. ఖండం
5. భూ గోళం
50% మందికి (100 మందిలో) దీని తరువాత సమాధానం తెలియరాలేదు.
6. సౌరకుటుంబం (మన సౌరకుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. అందులో భూమి 3 వ గ్రహం.
అదనపు సమాచారం: కాంతి ఒక సెకనుకు 3 లక్షల కి.మీ ల వేగంతో ప్రయాణిస్తుంది. అయినాగాని, సూర్యుని నుండి భూమిని చేరడానికి 500 సెకనులు తీసుకుంటుంది. భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంతో మరి ఆలోచించండి)
7. పాలపుంత నక్షత్ర మండలం (సూర్యుడితో కలిపి 400 బిలియన్ నక్షత్రాలు ఇందులో ఉన్నాయి.
అదనపు సమాచారం: కాంతి ఒక సెకనుకు 3 లక్షల కి.మీ ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక సంవత్సరంలో కాంతి 10 ట్రిలియన్ కి.మీ లు ప్రయాణిస్తుంది. ఈ దూరమే ఒక కాంతి సంవత్సరం. అపారమైన దూరాన్ని కొలవడానికి ఇది ఒక కొలమానం. పాలపుంత నక్షత్ర మండలం యొక్క వ్యాసం దాదాపు 1 లక్ష కాంతి సంవత్సరాలు)
8. విశ్వం (పాలపుంత నక్షత్ర మండలంతో కలిపి 200 బిలియన్ల నక్షత్ర మండలాలు ఇందులో ఉన్నాయి. విశ్వం యొక్క సరిహద్దులు పూర్తిగా ఇంకా కనుగొనలేదు)
ఇదే సమాధానం.
మరల ఆలోచించండి.
మనం ఎక్కడ ఉన్నాము?
అనంతమైన విశ్వంలో, కోల్పోయిన మూలాలలో కదులుతున్న ఒక చిన్న ధూళి పై. అందులోనే ఎన్ని కథలు. ఎన్ని జీవాలు!




0 comments: